Friday, December 19, 2008

శిరిడీయే పోవాలా !

శ్రీసాయిని దర్శించ శిరిడీయే పోవాలా!
సద్గురువుని సేవించ మందిరమే చేరాలా!

పసిపాప నవ్వులో నీ దరహాసమే
పచ్చని పైరులో నీ ప్రతిబింభమే

నాట్యమయూరిలో నీ తన్మయ నృత్యం
కోయిల పాటలో నీ మధుర స్వరం

కురిసే చిరుజల్లులో నీ కరుణామృతం
వీచే చిరుగాలిలో నీ చందన పరిమళం

పూసే పూలలో నీ ప్రేమ మకరందం
మెరిసేటి తారలలో నీ సుందర నయనం

వేసే ప్రతి అడుగులో నీ దివ్య చరణం
స్పందించే హృదయంలో నీ నామస్మరణం

ఏ చోట చూసినా నీవే ఉన్నావు
ముల్లోకాలకు ప్రభువై మమ్ము రక్షించుచున్నావు

మధురం

మధురం మధురం ఎంతో మధురం
శ్రీసాయి నీ నామం ఎంతో మధురం
జయసాయి నీ నామం ఎంతో మధురం
నీ ఊసు మధురం నీ ధ్యాస మధురం
నీ ధ్యానం మధురం నీ సేవ మధురం
||మధురం ||
నీ రూపు మధురం నీ శైలి మధురం
నీ కనులు మధురం ఆ కాంతి మధురం
నీ చేయి మధురం ఆ స్పర్శ మధురం
నీ పాదం మధురం ఆ ధూళి మధురం
నీ గళం మధురం నీ స్వరం మధురం
||మధురం ||
నీ మనసు మధురం నీ మమత మధురం
నీ జాలి మధురం నీ కరుణ మధురం
నీ భిక్ష మధురం నీ రొట్టె మధురం
నీ ఊది మధురం నీ వైద్యం మధురం
నీ తోడు మధురం నీ అభయం మధురం

మధురం మధురం సర్వం మధురం
మధురం మధురం శ్రీసాయి మధురం

బాబా విభూదిం

బాబా విభూదిం సర్వపాప నివారిణం
బాబా విభూదిం స్వర్గమార్గ ప్రసాదితం

బాబా విభూదిం సర్వదు:నివారిణం
బాబా విభూదిం సర్వసౌఖ్య ప్రసాదితం

బాబా విభూదిం మనఃస్థాప నివారిణం
బాబా విభూదిం మనఃశాంతి ప్రసాదితం

బాబా విభూదిం సర్వరోగ నివారిణం
బాబా విభూదిం ఆయురారోగ్య ప్రసాదితం

బాబా నామం మృత్యుంజయ మంత్రం
బాబా నామం జీవకోటికి ఆధారం

ప్రార్ధన

నీ పాదధూళిలో ఇసుక రేణువైనా చాలు

నీవు పీల్చే గాలినైనా చాలు

నీ వస్త్రములో నూలుపోగునైనా చాలు

నీవు త్రాగే నీటిలో ఒక చుక్కనైనా చాలు

నీ చేతిలో సటకానైనా చాలు

నీ చెంత ఉండే నువ్వు చేరదీసే జీవినైనా చాలు

నీ ప్రేమ నాపై రవ్వంత ఉన్నా చాలు

నీ ప్రియ భక్తులలో నేను ఒకదానినైనా చాలు

నీ మనసులో నన్ను ఒక్కసారి తలచినా చాలు

నీకు పెట్టే పువ్వునైనా చాలు

నువ్వు సేవించే రొట్టెనైనా చాలు

నువ్వు నిలుచున్న నేలనైనా చాలు

నువ్వు వాడే నూనెనైనా చాలు

బాబా నాపై కరుణ చూపు నన్ను నీ చెంత చేర్చు








Tuesday, December 16, 2008

సాయి లీలలు-1

చిత్రమయ్యా నీ వ్యవహారం
అంతుపట్టదు నీ లీలామహత్యం

ఎన్నో జీవులను సృష్టిస్తావు
తుదివరకు వెంటున్డి రక్షిస్తావు

బంధాలతోటి మమ్ము బందిస్తావు
అనురాగంతో మమ్ము అలరిస్తావు

అమ్మవై నీవు ప్రేమను కురిపిస్తావు
నాన్నవై నీవు మమతను పంచిస్తావు

ప్రతి అణువులో నీవు కోలువుంతావు
భేదభావమేరుగక అభయమొసుగుతావు

మనసులో ఎన్నో ఆశలు పుట్టిస్తావు
కోర్కెల వెంట పరుగులు తీయిస్తావు

నీవు ఆడే ఆటలో బొమ్మలం మేము
నీకు తోచినట్టు మలచుకుంటావు

మాయా చక్రంలో మమ్ము ఇరికిస్తావు
నిన్ను మరిపించి మమ్ము బాధిస్తావు

ఆర్తితో వేడిన చాలు ఆధుకుంటావు
సర్వం నీవేనని మాకు తెలియజేస్తావు

ఎన్నెన్ని జన్మలగా మాకు తోడున్డినావో
మా కష్టసుఖాలతో ఎంత అలసినావో

ఏమిచ్చి తీర్చుకోగలం నీ ఋణము
నీ సేవలో తరించనీయి జీవితము