Thursday, February 12, 2009

సాయి సాయి

సాయి సాయి కనిపించవయ్యా, నా తప్పులను మన్నించి కరునించవయ్యా
ప్రేమతో నీ ఒడికి చేర్చుకోవయ్యా, గోరుముద్దలు పెట్టి లాలించవయ్యా
ఒక్కసారి నీ ఎదపై నిదురించనీవయ్యా , గుండెభారమంతా తగ్గించవయ్యా
బంధాలు అన్నీ అశాస్వతాలయ్యా, నీ తోడు ఒక్కటే చిరకాలమయ్యా
ఓంసాయి శ్రీసాయి జయసాయినాధ మమ్మేలు మా తండ్రి శ్రీసాయినాధ

బాయీజాకు అయ్యావు అన్నయ్య, తాత్యాకు నీవు ప్రియమైన మామయ్య
ఆర్తితో వేడితే అభయమిస్తావయ్య, కంటతడి చూడలేని దయామయుడవయ్య
బాధలన్ని భరియించే సహనశీలివయ్య, ప్రాణాలను త్యజియించిన త్యాగమూర్తివయ్య
గర్వమన్నదెరుగని మహాజ్ఞానివయ్య, లోకాల స్థితిగతులు నీకే ఎరుకయ్య
ఓంసాయి శ్రీసాయి జయసాయినాధ మమ్మేలు మా తండ్రి శ్రీసాయినాధ

శరణన్న శ్యామాను కాపాడినావయ్య, పాము విషము తొలిగించినావయ్య
నీటితో జ్యోతులను వెలిగించినావయ్య, మాలోని అజ్ఞానం పోగొట్టినావయ్య
కనుసైగతో ప్రకృతిని శాసించినావయ్య, మమ్ము పాలించే ప్రభువు నీవయ్య
వేవేల బిడ్డలు నీకు ఉన్నారయ్య, నీ బిడ్డగా నన్ను స్వీకరించయ్య
ఓంసాయి శ్రీసాయి జయసాయినాధ మమ్మేలు మా తండ్రి శ్రీసాయినాధ




Wednesday, February 11, 2009

ఏమి భాగ్యం

నీ పూతోటలో నే కుసుమానినై
నీ సేవలో జన్మ తరియించనీయి

నీ ద్వారముకు నే తోరణమై
నిత్యం నీ ఎదుట నాట్యమాడనీయి

నీ ముంగిట నే ముత్యాలముగ్గునై
నీ మోములో కాంతి తిలకించనీయి

నీ ఎదుట నే కర్పూరహారతై
ఆర్తితో నిన్ను ప్రార్ధించనీయి

నీ సన్నిధిలో నే ప్రమిదనుయై
నీ చెంతనే నన్ను శయనించనీయి

నీ ధుని మంటలలో నే కట్టెనుయై
ఆ వెలుగులో నిన్ను దర్శించనీయి

నీ నుదుటన నే చందనమై
నీ చెలిమి మాధుర్యం చవిచూడనీయి

నా భవితకు నువ్వు మార్గదర్శివై
నిన్ను చేరు మార్గాన్ని చూపవోయి

నా మనసు

సాయి నిన్ను చూడాలని కోరింది నా మనసు
కోరికల చిట్టా నీ ముందు విప్పుతుందని తెలుసు

అడిగిన వెంటనే కాదనక నీ సన్నిధికి చేర్చా
మొదలెట్టిందిక తన లిస్టు అడిగింది అడిగింది

ఏవేవో అడిగింది కోరినవన్నీ తీర్చమంది
ఎంతకూ ఆగనంది తన గమ్యం తెలియకుంది

ఆశల పల్లకిలో ఊరేగే మనసుకేం తెలుసు
ఆ భారాన్ని మోసి నా శరీరమెంత అలసిందో

పాపం దానికీ అలుపొచ్చిందేమో ఆలోచించింది
తుదికి ఎక్కడా తృప్తి లేదని గ్రహించింది

శ్రీసాయిని ఏమి అడగాలో అప్పుడు తోచింది
తండ్రి నీ కరుణామృతాన్ని ప్రసాదించమని వేడింది

Friday, December 19, 2008

శిరిడీయే పోవాలా !

శ్రీసాయిని దర్శించ శిరిడీయే పోవాలా!
సద్గురువుని సేవించ మందిరమే చేరాలా!

పసిపాప నవ్వులో నీ దరహాసమే
పచ్చని పైరులో నీ ప్రతిబింభమే

నాట్యమయూరిలో నీ తన్మయ నృత్యం
కోయిల పాటలో నీ మధుర స్వరం

కురిసే చిరుజల్లులో నీ కరుణామృతం
వీచే చిరుగాలిలో నీ చందన పరిమళం

పూసే పూలలో నీ ప్రేమ మకరందం
మెరిసేటి తారలలో నీ సుందర నయనం

వేసే ప్రతి అడుగులో నీ దివ్య చరణం
స్పందించే హృదయంలో నీ నామస్మరణం

ఏ చోట చూసినా నీవే ఉన్నావు
ముల్లోకాలకు ప్రభువై మమ్ము రక్షించుచున్నావు

మధురం

మధురం మధురం ఎంతో మధురం
శ్రీసాయి నీ నామం ఎంతో మధురం
జయసాయి నీ నామం ఎంతో మధురం
నీ ఊసు మధురం నీ ధ్యాస మధురం
నీ ధ్యానం మధురం నీ సేవ మధురం
||మధురం ||
నీ రూపు మధురం నీ శైలి మధురం
నీ కనులు మధురం ఆ కాంతి మధురం
నీ చేయి మధురం ఆ స్పర్శ మధురం
నీ పాదం మధురం ఆ ధూళి మధురం
నీ గళం మధురం నీ స్వరం మధురం
||మధురం ||
నీ మనసు మధురం నీ మమత మధురం
నీ జాలి మధురం నీ కరుణ మధురం
నీ భిక్ష మధురం నీ రొట్టె మధురం
నీ ఊది మధురం నీ వైద్యం మధురం
నీ తోడు మధురం నీ అభయం మధురం

మధురం మధురం సర్వం మధురం
మధురం మధురం శ్రీసాయి మధురం

బాబా విభూదిం

బాబా విభూదిం సర్వపాప నివారిణం
బాబా విభూదిం స్వర్గమార్గ ప్రసాదితం

బాబా విభూదిం సర్వదు:నివారిణం
బాబా విభూదిం సర్వసౌఖ్య ప్రసాదితం

బాబా విభూదిం మనఃస్థాప నివారిణం
బాబా విభూదిం మనఃశాంతి ప్రసాదితం

బాబా విభూదిం సర్వరోగ నివారిణం
బాబా విభూదిం ఆయురారోగ్య ప్రసాదితం

బాబా నామం మృత్యుంజయ మంత్రం
బాబా నామం జీవకోటికి ఆధారం

ప్రార్ధన

నీ పాదధూళిలో ఇసుక రేణువైనా చాలు

నీవు పీల్చే గాలినైనా చాలు

నీ వస్త్రములో నూలుపోగునైనా చాలు

నీవు త్రాగే నీటిలో ఒక చుక్కనైనా చాలు

నీ చేతిలో సటకానైనా చాలు

నీ చెంత ఉండే నువ్వు చేరదీసే జీవినైనా చాలు

నీ ప్రేమ నాపై రవ్వంత ఉన్నా చాలు

నీ ప్రియ భక్తులలో నేను ఒకదానినైనా చాలు

నీ మనసులో నన్ను ఒక్కసారి తలచినా చాలు

నీకు పెట్టే పువ్వునైనా చాలు

నువ్వు సేవించే రొట్టెనైనా చాలు

నువ్వు నిలుచున్న నేలనైనా చాలు

నువ్వు వాడే నూనెనైనా చాలు

బాబా నాపై కరుణ చూపు నన్ను నీ చెంత చేర్చు